లైఫ్ అంటే కరెన్సీ రేస్ కాదు… సమాజంలో కష్టంలో ఉన్న వారికి నేనున్నా అంటూ చేయూత నిచ్చే హ్యూమన్ వేల్యూస్ బేస్ అని చాలా తక్కువ మంది నిరూపిస్తుంటారు. సరిగ్గా ఈ కోవకు చెందిన వారే ప్రముఖ వైద్యురాలు సుగంధి. విశాఖకు చెందిన వైద్యురాలు సుగంధి కెరియర్ ప్రారంభంలో తీసుకున్న ఓ నిర్ణయం… కొన్ని వేల మంది ప్రాణాల్ని నిలబెట్టింది. రెండున్నర దశాబ్దాల క్రితం విశాఖలో ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ను ఆమె నెలకొల్పారు. అత్యవసరంగా రక్తం కావాలంటే డబ్బులతో కొనుక్కోవాల్సిన రోజులవి. ఆ సమయంలో డాక్టర్ సుగంధి చూపిన చొరవ వేల మంది ప్రాణాల్ని కాపాడింది. రక్తదానంపై అంతంత మాత్రం అవగాహనతో ఉన్నసమాజాన్ని చైతన్య పరచడంలో ఆమె చేసిన నిర్విరామ కృషికి ఫలితంగా… ఏఎఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో సంజీవనిగా మారింది. ఇందుకు నిదర్శనంగా రెండు లక్షల మందికి పైగా ఈ రక్తనిధి కేంద్రం ద్వారా రక్తదానం చేశారు. వైద్య వృత్తిని వ్యాపార మార్గంగా కాకుండా సేవా పథంగా భావించి 27ఏళ్లుగా తన జీవితాన్ని ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ కు అంకితం చేసిన సుగంధి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మహిళా దినోత్సవం సందర్భంగా జనగళం అందిస్తున్న ‘ఇన్స్పైరింగ్ 30’ లో ఇవాళ మనతో సేవానుభవాలను పంచుకుంటున్న అతిథి డాక్టర్ సుగంధి.