సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
ఏకాంతంగా, వైభవంగా జరగనున్న అప్పన్న స్వామి కళ్యాణం
ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం అప్పన్న కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహించనున్నారు. రేపు సింహగిరిపై జరగనున్న కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులను అనుమతించకుండా కల్యాణ మహోత్సవం జరపుతున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. స్వామి వారి కల్యాణ ప్రసాదం, తలంబ్రాలు పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా రూ. 516 చెల్లించి స్వామి వారి కల్యాణ మహోత్సవ ప్రసాదాన్ని భక్తులు పొందవచ్చని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రిలోగా UPI ID: 9491000635@SBI లేదా SBI A/c number: 11257208642, IFSC Code: SBIN0009795కు భక్తులు డబ్బు పంపించి తమ పేరు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సంబంధిత వివరాలతో తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ను 6303800736కు వాట్సాప్ చేయాలన్నారు. ఈ విషయమై సమాచారం తెలుసుకునేందుకు సైతం పై ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.
అప్పన్న స్వామి కల్యాణ వేడుక ఇలా….
శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు సుప్రభాత సేవ అనంతరం ఆరాధన, విశేష హోమం, బాల భోగం, మంగళ స్నానం చేస్తారు. ఉదయం 11:30నిమిషాల నుంచి గంట సమయం మహారాజా భోగం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ధ్వజారోగం, ఎదురు సన్నాహోత్సవం, బంగారు తిరువీధి వేడుక ఉంటాయి. రాత్రి 7 గంటలకు భోగమండపంలో అప్పన్న స్వామి కల్యాణం నిమిత్తం విశ్వక్సేన పూజ జరుగుతుంది. స్థల శుద్ధి కార్యక్రమం పుణ్యాహవచనం అనంతరం రుత్విక్ వరణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది.