తాజా వార్తలుముఖ్యాంశాలు

అడ‌వి… ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది!   

 

మాయా లేదు. మంత్రం లేదు. చూస్తుండ‌గానే అక్క‌డో అడ‌వి ప్ర‌త్య‌క్ష‌మైంది. అది కూడా పచ్చని అందాలకు చోటు లేని ఓ కాంక్రీటు జంగిల్‌లో.  ఓ 16  ఏళ్ల  పిల్లాడి  చొరవతో ఇది సాథ్య‌మైంది.

ఈ అబ్బాయి పేరు స‌మ్రాట్ ఖ‌న్నా.  చిన్న కుర్రాడే. దిల్లీ ప‌బ్లిక్ స్కూల్లో చ‌దువుకుంటున్నాడు. ఎక్క‌డంటే దిల్లీకి ద‌గ్గ‌ర‌లోని ఫ‌రీదాబాద్లో.  రోజూ స్కూలుకు వెళ్లేప్పుడు ఓ ప్రాంతాన్ని చూస్తుండేవాడు. అంతా చెత్త ప‌ట్టుకొచ్చి అక్క‌డ ప‌డేస్తూ దాన్ని ఒక చెత్త యార్డులా త‌యారు చేశారు. ఎక్క‌డా మొక్క‌లు పెంచ‌డానికి ఖాళీయే లేదు. ఖాళీగా ఉన్న ఈ ప్రాంతాన్నేమో అంతా ఇలా చెత్త‌తో నింపేశారు. ఎలాగ‌యినా దీన్నే బాగుచేసి ఇక్క‌డ బోలెడు చెట్లు, మొక్క‌లు పెంచేయాల‌ని అనుకున్నాడు.    కాలుష్యం నుంచి బ‌య‌ట ప‌డాలంటే మొక్క‌లు పెంచ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని స‌మ్రాట్‌కి బాగా తెలుసు. అందుకే ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఎలాగైనా చిట్ట‌డివిని పెంచాల‌ని భావించాడు. తోటి పిల్ల‌లంద‌రినీ కూడ‌గ‌ట్టాడు. అంతా క‌లిసి కొంత కాలంలోనే ఆ చోటు నుంచి నాలుగు వేల ట‌న్నుల చెత్త‌ను బ‌య‌ట‌కు తీశారు.    ఇక మొక్క‌లు నాట‌డ‌మే త‌రువాయి అనుకున్నారు. కానీ అక్క‌డే వ‌చ్చింది చిక్కంతా. అంతా చెత్త, ప్లాస్టిక్ సంచులు ప‌డేయ‌డంతో ఆ నేల బీడుబారిన‌ట్లు అయింది. ఇంకా చెప్పాలంటే నిస్సారంగా మారింది. సమస్యకు పరిష్కారంగా కొన్ని వాన‌పాముల్ని తీసుకొచ్చి వ‌దిలితే భూమి గుల్ల‌బారి, సార‌వంతంగా త‌యార‌వుతుంద‌నే ఆలోచన తట్టింది. వెంటనే దగ్గరలోని ఎన్‌జీవోల సహాయం తీసుకున్నాడు.  వాన‌పాముల్ని వ‌దిలాక కొన్నాళ్ల‌కు నేల సారవంతంగా మారింది. అక్క‌డ కొన్ని రకాల మొక్క‌లు, పొద‌లు, పెంచడం ప్రారంభించాడు. అవి క్రమంగా పెరిగి కంటికి ఇంపుగా పచ్చదనం కప్పుకున్న చిట్టడవిగా మారాయి. కొన్ని నెలల క్రితం దుర్వాసనతో అటువైపుగా వెళ్లడానికి ఇబ్బంది కలిగించిన చెత్త యార్డు కాస్తా సమ్రాట్ ఆలోచనతో సుందర వనంగా మారింది. పచ్చదనం తారసపడడంతో క్రమంగా ఆ చిట్టడవిలోకి అనేక రకాల పక్షులు, కొన్ని జీవులు వచ్చి చేరుతున్నాయి.

     

ఏదేమైనా కంటిముందు కనిపించిన సమస్యకు పరిష్కారం చూపాలి అనుకున్న సమ్రాట్ ఆలోచన అద్భుత ఫలితాన్ని చూపిందనే చెప్పాలి. చెత్త యార్డు నుంచి రూపుదిద్దుకున్న చిట్టడవి నమూనాతో
మరికొన్ని చోట్ల ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ప్రకృతి పట్ల ఈ సమ్రాట్ ప్రదర్శించిన బాధ్యత
తోటి పిల్లల్లోను ఎంతో స్ఫూర్తిని కలిగిస్తోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button