విశాఖ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ మహరాష్ట్రకు పయనమైంది. ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని ఆక్సిజన్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను రైలు మార్గంలో ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ రైల్వే ట్రాక్ నుంచి కొద్ది సేపటి క్రితం ఆక్సిజన్ ట్యాంకర్లతో రైలు కదిలింది. ఆక్సిజన్ కొరతతో చాలా చోట్ల కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్న భయానక పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ దేశానికే అండగా నిలిచే దిశగా ఆక్సిజన్ సరఫరా చేస్తూ భరోసా కల్పిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వివిధ ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ అందిస్తోంది. దేశంలోనే అత్యధిక కొవిడ్ కేసులతో ఇబ్బంది పడుతున్న మహరాష్ట్రకు సైతం ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది.
ఉత్పత్తి ధరకే ఆక్సిజన్
అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య జరిగే ఉక్కు ఉత్పత్తి క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ అవసరం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా స్టీల్ ప్లాంట్ కు సొంతంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఉంది. ప్రస్తుతం ప్లాంట్ అవసరాలను తగ్గించుకుని ఆక్సిజన్ ను కొవిడ్ ఆసుపత్రుల కోసం అందిస్తున్నారు. కేవలం ఉత్పత్తికి అయ్యే ఖర్చును మాత్రమే తీసుకుంటూ ప్రాణవాయువును అందిస్తూ స్టీల్ ప్లాంట్ అందరి మన్ననలు అందుకుంటోంది.
ప్రభుత్వ రంగం కాబట్టే ప్రాణవాయువు అందింది…. ప్రైవేటు నిర్ణయం వద్దే వద్దు…
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా ఆక్సిజన్ ను కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు అందిస్తున్న తీరు ఆర్ఐఎన్ఎల్ పని తీరుకు నిదర్శనంగా వారు చెబుతున్నారు. ఈ ప్లాంట్
ప్రైవేటు పరమైతే ఇలాంటి సేవా భావంతో సహకరించే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు. ఈ స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే దిశగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ విశాఖ ప్లాంట్ నుంచి బయలుదేరే సమయంలో అక్కడికి చేరుకుని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.