కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఎగిరిన ఎయిర్ ఫోర్స్ విమానాలు
డబుల్ మ్యుటెంట్ రూపంలో విరుచుకుపడుతున్న కొవిడ్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ముఖ్యంగా ప్రాణవాయువు అందక ఎంతోమంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. ఈ సమస్యను అధిగమించే దిశగా భారత వైమానిక దళం ముందుకు కదిలింది.
నిన్నటి వరకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కదిలితే… ఇప్పుడు ఆక్సిజన్ కంటెయినర్లను మోసుకుంటూ విమానాలు గాలిలోకి ఎగురుతున్నాయి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు అండగా నిలిచేందుకు వైమానిక దళం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సవాళ్లకు ధీటుగా స్పందించే దిశగా ఐఏఎఫ్ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.
ఇండియా ఫైట్స్ కరోనా హ్యాష్ ట్యాగ్ తో(#IndiaFightsCorona) క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెయినర్లను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నట్లు ఐఏఎఫ్ వెల్లడించింది. C-17, IL-76 యుద్ధ విమానాలు కొవిడ్ రోగులకు అవసరమయ్యే ప్రాణ వాయువును రవాణా చేసే ట్యాంకర్లను వాయు మార్గంలో గమ్యానికి చేరుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అవసరం మేరకు అన్ని రాష్ట్రాల్లోను ఈ తరహా కొవిడ్ సేవలను వైమానిక దళ సిబ్బంది అందించనున్నారు.