చంద్రబాబు సంచలన నిర్ణయం – రాజ్య సభ ఎన్నికలకు టీడీపీ దూరం! TDP Chief CBN Sensational Decision on Rajyasabha Elections
రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయడం లేదనే విషయంపై పార్టీ నాయకులకు చంద్రబాబు స్పష్టత
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోటీలో అభ్యర్థులను నిలపడం లేదనే విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. రేపటితో నామినేషన్లకు గడువు ముుగుస్తున్న దృష్ట్యా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో రాజ్యసభ పోటీలో టీడీపీ నిలబడదని తెలిపారు. మరోవైపు ఎన్నికలకు అతి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్నందున పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఒకరిద్దరు నాయకులు చంద్రబాబు ఎదుట ప్రస్తావించారు. జగన్ పార్టీలోని ముఖ్యనేతలు తనకు టచ్ లో ఉన్న మాట వాస్తవమేనని చంద్రబాబు వెల్లడించారు. అయితే అన్నీ ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పని చేస్తున్న వారికి నష్టం జరగకుండా చూడడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. టీడీపీ – జనసేన పొత్తు అంశాలు, రా కదలిరా బహిరంగ సభలు సహా లోకేష్ శంఖారావం కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, కంభంపాటి రామ్మోహన్ ఉన్నారు.