టీడీపీతో జత కట్టేందుకు సై అంటున్న బీజేపీ – తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు | BJP with TDP
ఏపీలో 2014 నాటి ఎన్నికల కాంబినేషన్ దిశగా పావులు కదుపుతున్న చంద్రబాబు, పవన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఓటమి భయం వణికిస్తోంది. భారతీయ జనతా పార్టీ టీడీపీ, జనసేనకు దగ్గర కావడంతో తాడేపల్లి వర్గాల్లో వణుకు ప్రారంభమైంది. చంద్రబాబు వైపు కమలనాథులు మొగ్గు చూపడం దాదాపుగా ఏపీలో వైసీపీ ఓటమిని ఖాయమైనట్లే అనే సంకేతాలు ప్రజా క్షేత్రంలోకి వెళుతున్నాయి. గత నెల 7వ తేదీన చంద్రబాబు దిల్లీ పర్యటనతో వైసీపీలో ప్రకంపనలకు దారి తీసింది. హుటాహుటిన వైఎస్ జగన్ దిల్లీలో వాలారు. అక్కడ బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. మరి తాడేపల్లి వ్యూహాలు ఎక్కడ బెడిసి కొట్టాయో ఏమో కానీ బీజేపీ మాత్రం బాబుతో జత కట్టాలనే నిశ్చయానికి వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో కచ్చితంగా జగన్ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందట. కమలనాథులకు అందిన సర్వే రిపోర్టులు ఏపీలో వైసీపీ కుప్పకూలుతుందని స్పష్టం చేశాయట. ఇక వైసీపీతో అంటకాగడం ఏ మాత్రం మంచిది కాదని అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు జగన్ ను దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో జత కట్టడం దీర్ఘకాలిక వ్యూహాలకు సైతం మేలు చేస్తుందని వారు విశ్వసిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి ఏపీలో పొత్తు వికసించాలని తీర్మానం చేశారు. అయితే సీట్లు విషయంలో కాస్త గట్టిగా పట్టుబట్టాలని భావిస్తున్నారు. వాస్తవిక పరిస్థితులు, బీజేపీకి ప్రస్తుత బలం కూటమికి మేలు చేసే విధంగా సీట్లను సర్దుబాటు చేసుకోవడం వంటి అంశాలపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఏదేమైనా ఏపీలో 2014 నాటి ఎన్నికల కాంబినేషన్ రిపీట్ కాబోతోందనేది సుస్పష్టం.