పని వద్దు – బడి ముద్దు
ఆపరేషన్ ముస్కాన్ లో 8,739 మంది పిల్లల్ని కాపాడిన ఏపీ పోలీసులు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ చేపట్టిన చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతమైంది. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 8,739 మంది చిన్నారులను పోలీసులు కాపాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ గణాంకాలు అనేక విషయాలను కళ్లకు కట్టాయి. పోలీసులు కాపాడిన చిన్నారుల్లో 4,234 మంది కార్మికులుగా పని చేస్తున్నారు. 123 మంది పిల్లలు యాచకులుగా జీవిస్తుండగా, 772 మంది వీధిబాలలుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 228 మంది వీరిలో ఉన్నారు. 98 మంది శారీరక వైకల్యంతో, 10మంది మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు.
చిన్నారులను కాపాడి సంరక్షణ కేంద్రాలకు తరలించే ప్రక్రియలో కొవిడ్ నిబంధనల్ని పోలీసులు కచ్చితంగా పాటించారు. అనంతరం తల్లిదండ్రులకు వారిని అప్పగించి కౌన్సిలింగ్ చేశారు. మరోవైపు కొవిడ్ లక్షణాలతో ఉన్న పిల్లలకు పరీక్షలు చేయించగా వారిలో కొందరికి పాజిటివ్ వచ్చింది. కొవిడ్ వచ్చిన పిల్లలకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
రేపటి తరాన్ని కాపాడుకుందాం: డీజీపీ
ఆపరేషన్ ముస్కన్ ను విజయవంతం చేసిన పోలీసులను డీజీపీ అభినందించారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను డీజీపీ గుర్తు చేశారు. చిన్నారులను పాఠశాలకు మాత్రమే పంపించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. పిల్లల్ని పనికి పంపితే రేపటి తరాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుందన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించి బాలల భవిష్యత్తును కాపాడే దిశగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.