బీసీల పొట్టకొట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్: జనసేన అధినేత
బీసీ డిక్లరేషన్ సభలో జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు

మంగళగిరి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో బీసీలు పూర్తిగా అణచివేయబడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్న ఆయన బీసీ కులాల ఐక్యతకు పిలుపు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీల పొట్టకొట్టారని విమర్శించారు. ఇసుక రీచ్లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టిన తీరును ఎండగట్టారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లేదని, కుర్చీలు వేయలేదని బీసీలకు ఏటా రూ. 15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి జగన్ మోసగించారని అన్నారు. వివిధ బీసీ కులాల అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై వచ్చే రోజుల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ లోని అంశాలపై హర్షం వ్యక్తం చేసిన ఆయన బీసీ రక్షణ చట్టం ఆవశ్యకతను ఉద్ఘాటించారు. బీసీ కులాలు యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలన్నదే జనసేన ఉద్దేశమని ఆ దిశగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని చెప్పారు. బీసీ కులాల రాజకీయ చైతన్యానికి, రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను పవన్ ఈ వేదికపై స్మరించుకున్నారు.