విశాఖ హెచ్పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం!
విశాఖలో హెచ్పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్లాంట్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అగ్ని కీలలను అదుపులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వరుస ప్రమాదాలను అరికట్టాలి: ఓ. నరేష్ కుమార్, పారిశ్రామిక వేత్త
విశాఖలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చూస్తున్నాం. ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు విస్తరణ బాట పడుతున్న పరిశ్రమలు భద్రతా అంశాలపై ఆ స్థాయిలో దృష్టి సారించడం లేదు. పరిశ్రమల్లో సుశిక్షుతులైన యువ సిబ్బంది నియామకం ఎంతో అవసరం. 55ఏళ్లు పైబడిన వారు ప్రమాదాలకు ఆస్కారం ఉండే కీలక ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. చురుకుగా పరిస్థితి అంచనా వేయడంలో యువ సిబ్బంది కీలకం అవుతారు. విశాఖలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు దశాబ్దాల క్రితం ఏర్పడ్డాయి. వీటిలో ఉండే వ్యవస్థలపై సమీక్ష అవసరం. కాలం చెల్లుబాటుకు దగ్గరలో ఉండే ఎక్విప్మెంట్ కొనసాగించడం ప్రమాదాలకు దారి తీస్తోంది. విశాఖలో ఉండే వాతావరణం దృష్ట్యా ఇక్కడి పరిశ్రమల్లో ఎక్విప్మెంట్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలను సైతం పరిగణలోకి తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు ఉండాలి. ప్రస్తుతం పరిశ్రమల్లో ఉండే ఎక్విప్ మెంట్ కు నాలుగైదు సంవత్సరాల కాల పరిమితి ఉన్నప్పటికీ వాటిని డీ-కమిషన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వ పారిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కు పూర్తి స్థాయి నియంత్రణ ఉండదు. కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలపై వారు కఠిన చర్యలు తీసుకోలేరు. అందుకే, కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాల పరిశీలనకు, అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షక వ్యవస్థ ఏర్పాటు ఎంతో అవసరం. పూర్తి స్థాయిలో ఎక్విప్ మెంట్ ను రీప్లేస్ చేయడం అంటే ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అంశాలు అన్నింటినీ అధ్యయనం చేసి దానికి అనుగుణంగా కచ్చితమైన చర్యలు ఉండాలి.