వైఎస్ షర్మిలా రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు?
షర్మిల పోటీ చేయడానికి ఛాన్స్ ఉన్న 3 స్థానాలు ఇవే...

షర్మిలకు ఉన్న ఇమేజ్ ఏమిటి?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలిగా మాత్రమే కాదు, జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలోని కీలక దశలో షర్మిల అండగా నిలిచిన తీరు ఏమంత చిన్న విషయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ దశ నుంచి 2019 ఎన్నికల వరకు షర్మిల భాగస్వామ్యాన్ని ఎవరూ కొట్టి పారేయలేరు. మరి నాడు జగన్ వదిలిన బాణం నేడు అదే జగన్ ను కడిగి పారేస్తోంది. వచ్చే ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆలోచన ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నికల పోరులో తలపడాల్సిన స్థానంపై షర్మిల విభిన్న కోణాల్లో ఆలోచనలు చేస్తున్నారు.
షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు?
కాంగ్రెస్ అంతర్గతంగా జరుపుతున్న మేథోమధనంలో మూడు స్థానాలపై చర్చిస్తున్నారని సమాచారం. తొలి ఆప్షన్ గా పులివెందుల అసెంబ్లీ సీటుకు బరిలో నిలిస్తే ఎలా ఉంటుందనేది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులపై షర్మిల కన్నేస్తే బాగుంటుందని కాంగ్రెస్ లోని ఓ వర్గం సూచన చేస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జగన్ పై పులివెందులలో వ్యతిరేకత కనిపిస్తోందని… ఇది ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశంగా చూస్తున్నారు. షర్మిల ఇక్కడి నుంచి బరిలో నిలిస్తే ఉత్కంఠ పోరు ఉంటుందని చెబుతున్నారట. సొంత చెల్లెలే పోటీకి నిలిస్తే… అది జగన్ పట్ల సెంటిమెంట్ క్రియేట్ చేసే అంశంగా మారవచ్చని మరో వర్గం అభిప్రాయపడినట్లు సమాచారం.
కడప పార్లమెంట్ పై షర్మిల గురి?
షర్మిల ముందున్న రెండో ఆప్షన్ కడప పార్లమెంట్. ఈ స్థానం చుట్టూ జరిగిన రాజకీయాలు… హత్యా రాజకీయాల గురించి దేశమంతా తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి బరిలో నిలవడం ద్వారా జగన్ ను రాజకీయంగా గట్టి దెబ్బ కొట్టాలనే యోచన సైతం షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడిస్తే… వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చినట్లు అవుతుందని వైఎస్ ను అమితంగా అభిమానించే వారు షర్మిల ముందు వాపోయారట. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన కారణంగా వివేకానందరెడ్డి బాత్రూంలో కాలు జారిపడ్డారు. వెంటనే కమోడ్ కు తలబాదుకుని అనంతరం గొడ్డలి పోటుకు గురయ్యారు. ఆ తర్వాత గుండె పోటుతో ఊహించని విధంగా మరణించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని ఇటీవల ఓ ముఖ్య సలహాదారుడు పరోక్షంగా షర్మిలకు హితవు పలికారు.
విశాఖ నుంచి షర్మిల పోటీ చేసే ఛాన్స్ ఉందా?
సో, పైన పేర్కొన్న రెండు స్థానాలను కాదనుకుంటే షర్మిల ముందున్న చివరి ఆప్షన్ విశాఖ పార్లమెంట్ స్థానమేనట. ఈ స్థానంలో రిస్క్ తక్కువ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట వైఎస్ షర్మిలా రెడ్డికి. వచ్చే ప్రభుత్వంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం వద్ద గట్టిగా తమ స్వరాన్ని వినిపించే వారు కొరవడే అవకాశం కచ్చితంగా ఉంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు బీజేపీతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నవే. కాబట్టి హస్తినలో హస్తం మాత్రమే కాస్త గట్టిగా బీజేపీని నిలదీసే అవకాశం ఉందనేది సుస్పష్టం. విశాఖ వరకు వస్తే రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాలు ఉన్నాయి. వీటిపై పార్లమెంట్ లో గట్టిగా నిలదీసే వారు కరవయ్యారు. ఇటీవల గల్లా జయదేవ్ వంటి నిఖార్సైన పార్లమెంట్ సభ్యుడు సైతం ఢిల్లీ వేదికగా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చశారు. ప్రజల పక్షాన గళం వినిపించే అవకాశాలు అరుదుగా ఉంటున్నాయని చెప్పారు. వీటన్నిటి దృష్ట్యా షర్మిల విశాఖ నుంచి పోటీ చేస్తే… ఆంధ్ర ప్రదేశ్ గళాన్ని, విభజన హక్కుల అంశాలను పార్లమెంటు వేదికగా బలంగా మాట్లాడే శక్తి ఉంటారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. విజ్ఞులైన విశాఖ ప్రజలు మాత్రమే షర్మిలకు ఏపీలో ఉన్న బెస్ట్ ఆప్షన్ అని వారు గట్టిగా నమ్ముతున్నారట.
విశాఖ ఎంపీ స్థానాన్ని గెలవడం సాధ్యమేనా?
విశాఖ పార్లమెంట్ స్థానం గెలవాలని అనుకోవడం వరకు ఓకే… కానీ, ఇక్కడి నుంచి బరిలో నిలిచే బలమైన అభ్యర్థులను ఢీ కొట్టడం ఏమంత సులువైన విషయం కాదు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జేడీ లక్ష్మీనారాయణ సైతం విశాఖ బరి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేకపోయినా… గీతం భరత్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. వీరంతా విశాఖ పార్లమెంట్ సీటును కైవసం చేసుకునేందుకు బలమైన ప్రభావం చూపగలిగే నాయకులే. ఈ అంశాలన్నిటినీ బేరీజు వేసుకుని షర్మిల ఏ సీటుపై గురిపెడతారో… తన రాజకీయ చాతుర్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారో వేచి చూడాలి మరి.