వృత్తి నైపుణ్యం, పది మందికి స్ఫూర్తిగా నిలవాలనే సంకల్పం కలిస్తే అద్భుతాలు ఆవిష్కరించవచ్చు. ఇంజినీరింగ్ విద్య అభ్యసించి ఎంతో మంది యువత ఉపాధి అవకాశాలు లేక నిరాశతో ఉండిపోవడం విశాఖకు చెందిన మెకానికల్ ఇంజినీర్ శ్రీధర్ ను ఆలోచనలో పడేసింది. లక్ష్యాలు నిర్దేశించుకుని పట్టుదలగా ఆలోచనలకు పదును పెడితే చదివిన చదువుకు సార్థకత చేకూరుతుందనేది శ్రీధర్ నమ్మకం. నోటి మాటగా కాకుండా ఆలోచనను ఆచరణ బాట పట్టించి… అనేక అద్భుతాలను ఆవిష్కరించే పని మొదలు పెట్టారు. ఆ దిశగా వినూత్న రీతిలో ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో వివిధ వాహనాలు రూపొందించారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా మెకానికల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల శ్రీధర్ తయారు చేసిన ఓ బ్యాటరీ వాహనం ఇప్పుడు విశాఖ రహదారులపై రయ్ రయ్ అనకుండా చాలా సైలెంట్ గా దూసుకెళుతోంది. ఆ వాహనం ఎటు వెళ్లినా చూపరులను మాత్రం ఇట్టే ఆకట్టుకుంటుంది. చూడడానికి భళే వెరైటీగా కనిపించే ఈ బ్యాటరీ వాహనాన్ని రూపొందించడం వెనుక అసలు కారణం మాత్రం ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతలో ప్రేరణ కలిగించడమే అని చెబుతున్నారు శ్రీధర్… ఆ విశేషాలను ‘జనగళం’ ప్రత్యేక కథనం ద్వారా మీకు అందిస్తోంది.